ప్రభుత్వ వ్యవస్థలపై పనిగట్టుకుని దాడి!!
తెలంగాణా రాష్ట్రం కుదురుకుని ఎదుగుతున్న క్రమంలో ఒక ముఠా పనిగట్టుకుని అడ్డుపడే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేస్తోన్న ప్రతిపనిని తప్పుపట్టడం తో పాటు, దానికి వ్యతిరేకంగా అల్లరి మూకలతో కలిసి ఆందోళనలు చేయడం, అక్కడితో ఆగకుండా కోర్టులకు వెళ్లి స్టే లతో పనులను ఆపేయించడం వంటివి వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రాజెక్టులు, పథకాలను అడ్డుకోవడానికే పరిమితమైన వీళ్ళు ఇప్పుడు ఉద్యోగాలను కూడా అడ్డుకునేంతగా దిగజారారు. తాజాగా తెలంగాణా రాష్ట్ర కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 ఫలితాలపై హైదరాబాద్ హైకోర్టు లో నమోదయిన కేసు కూడా ఈ కోవలోకే వస్తుంది. గతంలో మల్లన్నసాగర్, కాళేశ్వరం తదితర ప్రోజెక్టుల విషయంలో కేసులు వేసిన వాళ్ళే ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ నియామకాల ప్రక్రియకు అడ్డు పుల్లలు వేస్తున్నారు. కాంట్రక్టు అధ్యాపకులను రెగ్యూలరైజ్ చెయ్యడాని వ్యతికేస్తూ కోర్ట్ కు వెళ్లిన వాళ్ళు, సింగరేణి వారసత్వ ఉద్యాగాలను అడ్డుకున్న వాళ్ళు, పోలీసు రిక్రూట్మెంట్ లో అక్రమాలు జరిగాయని అల్లర్లు చేసిన వాళ్ళే ఇప్పుడు గ్రూప్ 2 విషయంలో కూడా గోల చేయిస్తున్నారు. దీనికోసం ఈ ముఠా మూడంచెల పద్ధతిని ఎంచుకున్నది. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం తలపెట్టినా, మంచి పని చేసినా ముందుగా అందులో రంధ్రాన్వేషణ చేసి, మీడియాలో, సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసి అపోహలు సృష్టించడం, వాటిని ఆధారం చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల పేరుతోనో, బయట జేఏసీ పేరుతోనో అల్లర్లు చేయించడం, ఆ వెంటనే ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడం మొదటి దశలో చేస్తుంటారు. రెండోదశలో జేఏసీ ప్రకటన వెలువడుతుంది, అపోహలు సృష్టించిన వాళ్ళే అనుమానాలు నివృత్తి చేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతారు. నిజానికి ఆరోపణలు చేసినవాళ్లు, అపోహలు ప్రచారం చేసిన వాళ్ళు ఆధారాలతో వచ్చి నిజాలు నిగ్గుతేల్చాలి. అనుమానించడమే హక్కు అయినట్టుగా, అపోహలు కల్పించడమే ప్రజా ఉద్యమం అయినట్టుగా ఈ అపార మేధావులు విస్తుగొలిపిస్తారు. వెనువెంటనే జేఏసీ వెనుక అదృశ్యంగా ఉన్న రాజకీయ శక్తులు, పార్టీలు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి అల్లరికి దిగి ఆరోపణల పరంపరతో విషం వెళ్లగక్కుతారు. ఈ లోగా రచనా రెడ్డి అనే న్యాయవాది రంగప్రవేశం చేస్తుంది. ఆమె పదిమందిని వెతికి పట్టుకుని కేసు వేస్తుంది. అదేం విచిత్రమో కానీ వెంటనే కోర్టు స్టే ఇచ్చేస్తుంది. ఇప్పటివరకు అన్నికేసుల్లోనూ అదే మనుషులు, అవే వాదనలు, ఇదే తంతు.
ఈ ముఠా దృష్టి ఇప్పుడు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థగా ఎదిగిన తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మీద పడింది. గత నవంబర్ నెలలో 1036 గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి టీఏపీఎస్సీ గత నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించింది, రాష్ట్ర సర్వీసుల్లో గ్రూప్-2 అత్యంత కీలకమైనది, తహశీలుదార్లు మొదలు వివిధ రకాల ఆఫీసర్లను ఈ పరీక్షద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కు చరిత్రలో ( ఉమ్మడి రాష్ట్రంలో కూడా) ఎన్నడూ లేని విధంగా ఎనిమిది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేయవలసి ఉన్న దృష్ట్యా టీఎస్పీఎస్సీపరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వం వెనువెంటనే అన్ని జిల్లాల కలెక్టర్ లతో మాట్లాడి పరీక్షల నిర్వహణ బాధ్యతను కలెక్టర్లు కు అప్పగించింది. ఒక్కొక్క జిల్లానుంచి లక్షలాది మంది హాజరవుతుండడం తో కాలేజీలతో పాటు చిన్న చిన్న పాఠశాలల్లో కూడా సెంటర్లు ఏర్పాటు చేయవలసి వచ్చింది. టీఎస్పీఎస్సీ తో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణ మాదిరిగా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవిన్యూయె సిబ్బంది నిర్వహణ భారాన్ని తమ భుజాలకు ఎత్తుకుని విజయవంతం చేశారు. అయినప్పటికీ కొన్నిచోట్ల చిన్న చిన్న అపశ్రుతులు దొర్లాయి.
ముఖ్యంగా గతంలో ఇలాంటి పరీక్షలు నిర్వహించిన అనుభవం లేని పాఠశాలల్లో, మొదటిసారిగా పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల అయోమయం , పరీక్ష నిర్వహణ పట్ల అవగాహన లేని కొందరు ఇన్విజిలేటర్ల వల్ల కొందరి జవాబు పత్రాల్లో కొట్టివేతలు జరిగాయి. నిజానికి ఏ పరీక్షలో అయినా ప్రశ్నాపత్రం మీద ఒక సీరియల్ నంబరు, జవాబు పత్రం మీద మరొక సీరియల్ నంబరు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రశ్నాపత్రం వివరాలు, సీరియల్ నెంబర్ తో పాటు పేపర్ కోడ్ ను జవాబుపత్రం ( వీటిని ఓ ఎం ఆర్ షీట్స్ అంటారు) మీద ఉన్న గడులలో రాసి, స్కానింగ్ కు వీలుగా దిద్దాలి. కొంతమంది అభ్యర్థులు ఆ వివరాలు నమోదు చేసుకున్న తరువాత తమకు ఇచ్చిన జవాబు పత్రాలు, ప్రశ్నాపత్రాలు ఒకే నెంబర్ తో లేవని గుర్తించారు. దాంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకు వెళ్లారు, నిజానికి అవి రెండూ ఒకే నెంబర్ అయి ఉండాల్సిన పనిలేదు. కలవాలని టీ ఎస్ పీ ఎస్ సి నిబంధనల్లో కూడా ఎక్కడా చెప్పలేదు. అయినా సరే అభ్యర్థుల ఆందోళనతో బెదిరిపోయిన కొందరు ఇన్విజిలేటర్లు ఒకరివిఒకరికి మార్చి కోడె నంబర్స్ సరిపోయేలా చేశారు. కానీ అప్పటికే వాటిమీద ఇతరుల వివరాలు ఉండడంతో వాటిని చెరిపివేసి, కొట్టివేసి, కొందరేమో మళ్ళీ దిద్ది వాళ్ళ వివరాలు రాసుకున్నారు. ఇదే పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ సమస్య పెద్దది కాకుండా వెంటనే స్పందించిన కమిషన్ ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని, మీరు నెంబర్లు తప్పురాసినప్పటికీ, పరీక్షల నిర్వాహకులు పంపే నివేదికల ఆధారంగా ఎవరి జవాబు పత్రాలు ఏవో గుర్తిస్తామని ప్రకటించింది. జవాబు పత్రాలను పూర్తిగా మనుషుల ప్రమేయం లేకుండా స్కానింగ్ ద్వారా దిద్దుతారు. ఎక్కడైనా కొట్టివేతలుగానీ, చెరిపివేతలుగానీ ఉంటే స్కానర్ గుర్తిస్తుంది. ఆ పేపర్ ను చెల్లుబాటు కాకుండా చేస్తుంది. అంతే కాకుండా కమిషన్ నిబంధనల ప్రకారం కూడా కొట్టివేతలు, చెరిపివేతలు ఉన్న జవాబు పత్రాలను పరిగణలోకి తీసుకోరు. దీనిని దృష్టిలో పెట్టుకుని టీఎస్పీఎస్సీ సమస్య పరిష్కారానికి ఒక నిపుణుల కమిటీని వేసింది. అన్ని అంశాలను పరిశీలించిన ఈ కమిటీ జవాబు పత్రాల్లోని వ్యక్తిగత వివరాలు సరిదిద్దేక్రమంలో కొట్టివేతలు, చెరిపివేతలు ఉన్నా వాటిని సరిచేస్తే తప్పులేదని, జవాబులను మారిస్తే మాత్రం అటువంటి పత్రాలను పరిగణించవద్దని సూచించింది.
తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష నీళ్లు నిధులు నియామకాల తో ముడిపడి ఉన్నటువంటిది, తెలంగాణా వస్తే ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఆశలున్నాయి. తదనుగుణంగానే తెలంగాణా ప్రభుత్వం వివిధ పోలీసు, విద్యుత్ బోర్డు లతో పాటు టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటికే యాభైవేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే రెండేళ్లకాలంలో కమిషన్ 26 రిక్రూట్మెంట్ లను ఎటువంటి ఆరోపణలు, వివాదాలు లేకుండా పూర్తిచేసింది. ఎన్నో ఆశలతో పరీక్షలు రాస్తున్న యువకులు, అవగాహనాలోపం వల్ల అందునా పరీక్షహాల్ లో ఇన్విజిలేటర్ చేసిన తప్పుకు ఎందుకు శిక్ష అనుభవించాలి అని భావించిన కమిషన్ నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా, పేర్లు, హాల్ టికెట్ నంబర్లు, పేపర్ కోడ్ వంటి వివరాలు తప్పుగా నమోదు చేసిన వారి జవాబు పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఒక రాజ్యాంగ సంస్థగా అలా నిర్ణయాలు తీసేసుకునే హక్కు కమిషన్ కు ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను కమిషన్ ప్రతిదశలోనూ రికార్డు చేసి ఉంచింది. దీనిని తప్పుపడుతూ ఈ ముఠా బయలుదేరి కమిషన్ మీద కోర్టుకు ఎక్కింది. కోర్ట్ ఎంపిక ప్రక్రియను మూడువారాలపాటు నిలిపివేసింది.
దీనిని రాజకీయం చేసి, యువతను మరింత రెచ్చగొట్టాలని చేసిన అన్ని ప్రయత్నాలను టీఎస్పీఎయస్సీ ఎప్పటికప్పుడు ఎండగట్టింది. ఒక్క నిజామాబాద్ నుంచి పార్లమెంట్ సభ్యరాలి ప్రమేయంతో 1500మంది ఎంపికయ్యారని, రాజ్యసభ సభ్యడు డ్. శ్రీనివాస్ కు చెందిన కాలేజీనుంచి వందలాదిమంది ఎంపికయ్యారని పుకార్లు లేవదీశారు. నిజానికి గ్రూప్ 2 ఫలితాల్లో అత్యంత తక్కువమంది ఎంపికయ్యింది నిజామాబాద్ నుంచేనని 32 వేల పైచిలుకు పరీక్షలు రాస్తే అక్కడినుంచి కేవలం 113 మంది మాత్రమే సర్టిఫికెఏ వెరిఫికేషన్ కు ఎంపికయ్యారని కమిషన్ చెప్పడమే కాకుండా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నట్టు అసలు డ్. శ్రీనివాస్ కు చెందిన కాలేజీలో పరీక్షాకేంద్రం కూడా లేదని నిర్ధారించింది. అలాగే నల్గొండనుంచి దేవేందర్ అనే జాగృతి నాయకుడికి ఉద్యోగం ఇచ్చారనే వదంతులను కూడా ఇదే ముఠా ప్రచారం చేసింది, అది తప్పని రుజువయ్యింది. సరిగ్గా ఇదే దశలో సమావేశమైన జేఏసీ ' గ్రూప్ 2 పై సందేహాలను నివృత్తి చేయాలని తీర్మానించింది,. ఆ మరుసటిరోజే కోర్టులో లాయర్ రచనా రెడ్డి కేసు ఫైల్ చేసింది.
ఏదయినా వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నప్పుడు, ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళవచ్చు, కోర్టులు ఉన్నవే వాటి పరిష్కారానికి, అలా కొందరు మెరిట్ లిస్ట్ లో లేని అభ్యర్థులు అప్పటికే కోర్ట్ కు వెళ్లారు , సురేందర్ రావు అనే న్యాయవాది ఆ కేసును ఫైల్ చేశారు, ఆయన చాలా హుందాగా వ్యవహరించారు కూడా. అవేవిషయాలకు మరింత విషం జోడించి రచనారెడ్డి కొత్త పిటిషన్ దాఖలు చేశారు. ఆమె కోర్టులో అసలు నోరువిప్పలేదు, ఏమీ వాదించలేదు కానీ టెలివిషన్, యూట్యూబ్ చానెల్స్ లో మాత్రం నోటికొచ్చిన అఆరోపణలన్నీ చేస్తున్నారు. అంటే కేసును ప్రభుత్వం మీద, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద దుష్ప్రచారానికి వాడుకుంటున్నారు. కేసులో బలముందటే కోర్టులో వాదించాలి కానీ ఒక రాజ్యాంగ సంస్థ మీద అబాండాలు వేస్తూ బయట మాట్లాడడం విజ్ఞత కాదన్న సోయికూడా ఆమెకు లేదు. పైగా తెలంగాణా రాష్త్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గానీ, సభ్యులు గానీ రాజకీయాలకు అతీతగా వుండే విషయ పరిణతి కలిగిన నిష్ణాతులు. మొత్తం పదిమంది సభ్యుల్లో ఒక రిటైర్డ్ జడ్జి, ఒక రిటైర్డ్ ప్రాసిక్యూటర్ తోపాటు మరో ముగ్గురు సభ్యులు న్యాయశాస్త్ర నిపుణులు. దాదాపు అందరూ వివిధ ఉన్నతోద్యోగాల్లో, వృత్తుల్లో నిష్కళంకితులుగా ఉన్నవాళ్లు, మేధావులు. 'వాళ్ళను నమ్మలేం' అని చెపుతూ నమ్మాల్సిన అవసరం లేదని అంటోంది రచనా రెడ్డి. మీరు మీ కేసులో ఆధారాలు చూపిస్తే నమ్మాలో లేదో ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ వ్యవస్థలమీద ఇలాంటి ప్రచారాలు చేయడం భావ్యం కాదు.
ఇక టీఎస్పీఎస్సీ మీద రెండో అభియోగం ప్రశ్నాపత్రాయాల్లో తప్పులు వచ్చాయి, రెండు, మూడు సార్లు కీ లు మార్చారు అని. ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో వందలాది బిట్స్ ఇచ్చేటప్పుడు కొన్ని సార్లు సరైన సమాధానాలు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు ఉంది ఉండవచ్చు. అది సమస్య కాదు. తప్పులను కీ లలో సవరించారా లేదా అనేది మాత్రమే ముఖ్యం. ఇటీవల 2017 లో కేంద్ర ప్రభుత్వం సి బీ ఎస్ సి ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ పరీక్షల్లో, ఐఐటీ జేఈఈ పరీక్షలో కూడా తప్పులు వచ్చాయి. అలాంటప్పుడు వాటిని, సరిచేసి, సరిఅయిన సమాధానాలు లేకపోతే ప్రశ్నలు తొలగించి మూల్యాంకనం చేస్తారు. టీఎస్పీఎస్సీ కూడా అదేపని చేసింది. పైగా తెలంగాణా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినందువల్ల, చరిత్ర, సామాజిక, ఆర్ధిక అంశాలమీద ఇంకా ప్రామాణికమైన రచనలు, గణాంకాలు లేవు అటువంటప్పుడు సమాధానాల్లో, ప్రశ్నల్లో ఇవి సాధారణం. అయినా ప్రశ్నపత్రాన్ని పరీక్షకంటే ముందు కమిషన్ లో చైర్మనుగానీ, సభ్యులుగానీ చూడరు. చూడకూడదు కూడా. దానికి పూర్తిగా అకాడమిక్ ప్యానెల్, నిపుణుల కమిటీ లే బాధ్యత వహిస్తాయి. ఈ కమిటీలలో తెలంగాణ మేధావులంతా ఉన్నారు.
పరీక్ష హాలులో హాల్ టికెట్ నంబర్స్ జంబుల్ చేయలేదని సీరియల్గానే వేశారని మరో అభియోగం, ఎక్కడైనా హాల్ టికెట్ నంబర్స్ సీరియల్ గానీ వేస్తారు, పరీక్షా పత్రాలు, అందులో ప్రశ్నలు మాత్రమే జంబుల్ చేస్తారు. ఈ సంగతి పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలాంటి థలా తోకాలేని అభియోగాలతో కోర్టును, నిరుద్యోగులను తప్పుతోవ పట్టించాలని ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇటువంటి కేసులతో ప్రక్రియలను నిలుపుచేసే కుట్ర ఇప్పటికే అన్నిసింగరేణి, విద్యుత్తు, పోలీసు నియామకాల్లో కూడా జరిగింది. ఇప్పుడు ముఠా దృష్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కూడా పడింది. ఉద్యోగ నియామకాలు వేగంగా పారదర్శకంగా జరుగుతన్న ఈ తరుణంలో ప్రభుత్వ వ్యవస్థల మీద, వ్యక్తుల మీద బురద చల్లి, అపోహలు కల్పించి, ఆందోళనలు సృష్టించే ప్రయత్నాలు తిప్పికొట్టాలి. ముఖ్యంగా తెలంగాణా యువత ఇలాంటి ముఠాలపట్ల అప్రమత్తంగా ఉండాలి.
డా. రాహుల్ రాజారామ్
Comments
Post a Comment