ఫెడరల్ ఫ్రంట్: తక్షణ కర్తవ్యం!

రాష్ట్రాల ప్రయోజనాలే ప్రాతిపదిక కావాలి 

 కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ తక్షణ కర్తవ్యాలు, కార్యాచరణ పై పరిశోధకుడు, రాజకీయ విశ్లేషకుడు డా. రాహుల్ రాజారామ్ రాసిన వ్యాసాల్లో ఇది మూడవది. 16 ఏప్రిల్  2017 నమస్తే తెలంగాణా పత్రికలో అచ్చయిని ఈ వ్యాసం చర్చ్ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం. - నీలమేఘం 


సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మొదటిదశ తో పాటు తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఆదర్శవంతమైన రీతిలో పూర్తయ్యింది. చాలా రోజుల తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) తనదైన శైలిలో సమీక్షలు చేస్తున్నారు, అసెంబ్లీ కి ఎన్నికలు పూర్తయి రెండవ దశ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసాక పార్లమెంట్ ఎన్నికల మూలంగా ఆయన పాలన మీద పెద్దగా దృష్టి పెట్టనప్పటికీ ఈసారి పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులుంటాయన్న సంకేతాలు ఇచ్చారు. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేసి జూన్ నుంచి తెలంగాణలో సమూలమార్పులు జరుగబోతున్నాయన్న చర్చ సర్వత్రా మొదలయ్యింది. ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ఫెడరల్ ఫ్రంట్ మీద కూడా చర్చ మొదలయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లో లేనంత అనిశ్చితి ఇప్పుడు దేశంలో నెలకొని ఉంది. దీనికి మోడీ ప్రతిష్ట దిగజారి పోయి భారతీయ జనతాపార్టీ కుదేలయిపోతుండడం ఒక కారణం అయితే, రాహుల్ గాంధీ పూర్తి పరిణతి సాధించిన నమ్మకం కలుగక పోవడం, కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగక పోవడం రెండోది. ఇటువంటి సందర్భాలు గతంలో కూడా వచ్చినా అంతో ఇంతో మూడో ప్రత్యామ్నాయం పేరుతో కమ్యూనిస్టులు సోషలిస్టుల కూటమి ఏకమయ్యేది. చిన్నా చితకా పార్టీలు దానిచుట్టూ చేరిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థి లేదు. అసలు కమ్మూనిస్టులే ఉనికిలో లేకుండా పోయారు. సోషలిస్టుల సంగతి సరేసరి. ఇప్పుడు భారత దేశంలో సిద్ధాంత రాజకీయాలే చెల్లుబాటులో లేకుండా పోయిన వాతావరణం నెలకొంది. మూడో ఫ్రంట్ పేరుతో చంద్రబాబు నాయుడు తో సహా కొందరు ముందస్తు హడావిడి చేసినా దానికి సిద్ధాంత ప్రాతిపదిక, కనీస ఉమ్మడి ఆచరణ లేకపోవడంతో అది పూర్తిస్థాయి రూపాన్ని సంతరించుకుకోలేదు. ఈ దశలో రాష్ట్రాల అవసరాలు, అధికారాలు ఇరుసుగా చేసుకుని కేసీఆర్ చేసిన ఫెడరల్ ఆలోచనకు ప్రాధాన్యత ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. అదే ఇప్పుడు దేశానికి అవసరమైన రాజకీయ సిద్ధాంతమని అంటున్నారు.

 ఆకాంక్షలు-అడ్డంకులు !

రాజకీయాలు ఇప్పుడు సిద్ధాంత ప్రాతిపదిక నుంచి అవసరాల ప్రాతిపదికతో నడుస్తున్నాయి. దేశ రాజకీయాల్లో మొదటినుంచి రెండు శిబిరాలు ఉంటూ వస్తున్నాయి. ఈ రెండూ విఫలమైన సందర్భాల్లో  మూడో శిభిరం వెలుస్తూ వస్తోంది. మొదట జనతాపార్టీ (1977), ఆ తరువాత జనతాదళ్ (1988) అలాగే ఏర్పడ్డాయి. ఈ రెండూ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా సోషలిస్టు సిద్ధాంత  పునాదులమీద ఏర్పడ్డాయి. కానీ దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశించిన (1991) తరువాత రాజకీయ పార్టీలు కొద్దికాలంపాటు సామ్యవాదం, సమానత్వం, సామాజిక న్యాయం లాంటివాటి గురించి మాట్లాడినా క్రమంగా అందరూ ప్రపంచీకరణ మాయలో పడిపోయి కొత్త అభివృద్ధి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారు. నూతన ఆర్ధిక విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతాపార్టీ తో పాటు సోషలిస్టులు గట్టిగా వ్యతిరేకించారు. కమ్యూనిస్టులైతే తిరగబడ్డంత పనిచేశారు. కానీ తరువాతి కాలంలో కమ్యూనిస్టులతో సహా అందరూ ప్రయివేటీకరణను సమర్ధించారు, ప్రోత్సహించారు. ప్రభుత్వరంగంనుంచి పెట్టుబడులు ఉపసంహరించడం, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలకు తలొగ్గి ప్రయివేటు, బహుళజాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ పరచడం వంటివి పీవీ, వాజపేయి, మన్మోహన్ సింగ్ ల నాయకత్వంలో పోటాపోటీగా చేశారు. అదే కాలంలో రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో పోటీపడి ప్రయివేటీకరణకు పూనుకున్నాయి. గుజరాత్ లో నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి, బెంగాల్ లో జ్యోతిబసు, బుద్ధదేవ్ నాయకత్వంలోని కమ్యూనిస్టులకు ఏమాత్రం తేడా లేనివిధంగా ఈ పరుగు సాగింది. ఇప్పుడు తృతీయ ఫ్రంట్ అంటున్న చంద్రబాబు ఆ పరుగుపందెంలో ఛాంపియన్  గా నిలిచినవారే!. ఈ ఫలితంగా పార్లమెంటరీ రాజకీయాలనుంచి రైట్, లెఫ్ట్ సెంట్రిస్ట్ వంటి సైద్ధాంతిక ధోరణులు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఈ క్రమంలో అభివృద్ధి పేరుతో మార్కెట్ విస్తరణే ప్రధాన సిద్ధాంతగా ఆవిర్భవించింది. వస్తువినిమయ ప్రపంచంలో అదే ప్రజల అభివృద్ధే ఆకాంక్షగా కూడా మారిపోయింది. అభివృద్ధి అంటే ఇప్పుడు జీడీపీ తో మాత్రమే కొలిచే స్థితిలో మనం ఉన్నాం, ప్రభత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటు పెట్టుబడుల ఆకర్షణ మాత్రమే అభివృద్ధి సూచీలుగా మారిపోయిన ఈ స్థితిలో ప్రతిరాష్ట్రం ఇప్పుడు ఆర్ధిక స్వేచ్ఛను కోరుకుంటోంది. తాము సమకూర్చుకుంటున్న ఆదాయం మీద, పన్నుల మీద, వనరుల మీద తమకే అధికారం ఉండాలని భావిస్తోంది. అలాగే రాష్ట్రాలకు తమ అవసరాలనుబట్టి ప్రాధాన్యతలు నిర్ణయించుకుని విధానాలు రూపొందించుకునే స్వాతంత్య్రం ఉండాలని, దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులు ఉండాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. 



ఇక రెండోది సామాజిక అవసరాలకు అనుగుణంగా విధానాలు నిర్ణయిచుకునే స్వాతంత్య్రం ఇప్పుడున్న విధానంలో వీలుకాకపోవడం. సామాజిక అభివృద్ధికి సంబందించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇప్పుడు రాష్ట్రాలకు లేదు. నిజానికి ఇందులోనుంచే కేసీఆర్ ఫెడరల్ ఆలోచన వచ్చింది. ముస్లిం రేజర్వేషన్ల సందర్బంగా ఆయన ఈ విషయాన్ని ప్రధానంగా లేవనెత్తారు.  ఇలాంటి అనేక అంశాల మీద అధికారాలను రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ను అడ్డం పెట్టుకుని కేంద్రం  ఉంచుకుంది. ముఖ్యంగా కేంద్ర అధికారాల జాబితాలో ఉన్న 97 అంశాలతో పాటు ఉమ్మడి జాబితాలో కూడా మరో 52 అంశాలను చేర్చుకుని కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తోంది. ముఖ్యంగా సామాజిక జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే అంశాలు కూడా అందులో ఉండడం పెద్ద ప్రతిబంధకంగా మారిపోయింది. ముఖ్యంగా ఆర్ధిక, సామాజిక ప్రణాళికలు, సామాజిక భద్రత, పరిశ్రమలు, వాణిజ్యం, కార్మికుల సంక్షేమం, విద్య, విద్యుత్తు, ఆరోగ్యం,కుటుంబ సంక్షేమం, భూసేకరణ చివరకు తూనికలు కొలతలు వంటివి కూడా ఈ జాబితాలో చేర్చారు. స్థానిక అవసరాల రీత్యా ఏ ఛట్ఠం చేయాలన్నా అది కేంద్ర ప్రభుత్వ చట్టానికి అనుగుణంగానే ఉండాలితప్ప సొంత ఆలోచన ఉండకూడదు. ఇప్పుడు కేసీఆర్ ఇవి ప్రస్తావిస్తున్నారు.

దుడ్డు ఉన్నోడిదే బఱ్ఱె!
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో తెలంగాణా రాష్ట్ర సమితి పూర్తిగా ఫెడరల్ అజెండా మీదనే ఫోకస్ ఉంచింది. పూర్తిగా జాతీయ అంశాలు, రాష్ట్రాల హక్కులు, వాటాల గురించే కేసీఆర్ మాట్లాడారు. ఎక్కువమంది సభ్యులు ఎందుకు  గెలవాలో వివరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు దీనిని మరింత విడమరిచి పార్లమెంటులో 'దుడ్డు ఉన్నోడిదే బఱ్ఱె' అని సామాన్య ఓటర్లకు కూడా అర్థం చేయించే ప్రయత్నం చేశారు. దీన్నే రాజనీతిశాస్త్ర  పరిభాషలో బేరసారాల సమాఖ్యవాదం (bargaining federalism) అంటారు. భారత దేశం అమెరికాలో మాదిరిగా పూర్తిస్థాయి సమాఖ్య రాజ్యం కాదు, పాక్షిక సమాఖ్యగా చెపుతున్న, ఇందులో పాక్షిక అధికారాలకంటే పక్షపాత ధోరణులు ఎక్కువ. మరీ ముఖ్యంగా 1967 తరువాత కాంగ్రెస్ పార్టీ చాలారాష్ట్రాల్లో ఓడిపోవడం మొదలయిన తరువాత ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకోవాల్సి వచ్చింది. తమిళనాట ద్రవిడ పార్టీలతో మొదలయిన ఈ తతంగం ఇంకా కొనసాగుతోంది. ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, భారతీయ జనతాపార్టీ కూడా అదే పని చేసింది. ఒక్క 2014 ఎన్నికల్లో తప్ప బీజేపీకి ఏనాడు కూడా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే మెజారిటీ రాలేదు. చిన్న చితకా పార్టీలను కలుపుకుని ఈ రెండు పార్టీలు సంకీర్ణం పేరుతో అధికారాన్ని చెలాయిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో తమకు మద్దత్తునిస్తున్న పార్టీలకు అనుకూలమైన విధానాలు అవలంభిస్తూ  బేరసారాల పాలన  చేస్తున్నాయి. అలాగే సహకరించని పార్టీలను వేధించడం, ఆ పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం కూడా ఈ బేరసారాల్లో భాగమే. 

Image result for indinan politics
చరిత్రలోకివెళ్లి పరిశీలిస్తే ఇందిరా గాంధీ హత్య తరువాత 1984 లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం, 2014 మోడీ ప్రభుత్వం మినహా అన్నీ సంకీర్ణాలే. సంకీర్ణం అంటే మెజారిటీ లేకపోయినా ఇతరుల సహకారంతో గద్దెనెక్కడం. ఇందులో కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ఈ బేరసారాలతో ప్రభుత్వాలను నిలబెట్టుకున్నాయి,  జనతాదళ్ ప్రయోగం విఫలం అయ్యాక 1991 లో పీవీ నరసింహ రావు నాయకత్వంలో ఏర్పడింది కూడా సంకీర్ణ ప్రభుత్వమే అయినా ఐదేళ్లు పూర్తికాలం పనిచేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 244 సెట్లు మాత్రమే వచ్చాయి, బీజేపీ 120 సీట్లతో ఆగిపోయింది. అలాగే 1996లో కేవలం 162 స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ నుంచి ఆటలబీహారీ వాజపేయి ప్రధాని కాగలిగారు, అయితే 13 రోజుల్లోనే బేరసారాలు కుదరక పదవినుంచి వైదొలిగారు, అయినా తిరిగి 1998 లో ఆయన 182 సీట్లతో రెండోసారి,1999 లో అంతే సీట్లతో మూడోసారి ప్రధాని కాగలిగారు. నిజానికి మూడు  ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ కంటే ఇతరపార్టీలకే ఎక్కువ సీట్లు వచ్చాయి. 1996లో 242 సీట్లు, 1998 లో 220 సీట్లు, 1997 లో 247 సీట్లు సాధించి చిన్న పార్టీలే పెద్దసంఖ్యను కలిగి ఉన్నాయి. ఆ తరువాత 2004 లో కూడా మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పుడు కాంగ్రెస్ కు వచ్చింది 145 సీట్లు మాతృహమే, ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 136 సీట్లు మాత్రమే సాధించగా చిన్న పార్టీలు 221 సీట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్నప్పటికీ నిర్ణాయక శక్తి కాలేదు, అలాగే 2014 లో కాంగ్రెస్ 206, బీజేపీ 116 సీట్లు మాత్రమే సాధించాయి 211 సీట్లు సాధించిన ఇతరపార్టీలు కేవలం బేరసారాల బరిలో నిలవాల్సి వచ్చింది. ఈ వివరాలన్నీ గమనిస్తే కేవలం అతిపెద్ద పార్టీగా (కేవలం 20-30  శాతం స్థానాలతో) అవతరించిన కారణంగా ఆయా పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగాయి. ఇప్పుడు తెరాస  చేస్తున్న వాదనలో కీలకాంశం ఇదే. అందుకే కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలను పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు అంటున్నరు . చిన్న సైజు ప్రాంతీయ పార్టీలన్నీ ఫెడరల్ పునాది మీద నిలబడి ఈ పెద్దపార్టీలను దెబ్బకొట్టాలంటున్నారు.

ఫెడరల్ పునాది
నిజానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా చిన్నపార్టీలే పెద్ద శక్తిగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అఖిలేష్, మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్,స్టాలిన్ లతో ఇప్పటికే కేసీఆర్ మాట్లాడి ఉన్నారు. బీహార్లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో శరత్ పవార్, ఆంద్ర ప్రదేశ్ లో జగన్ కూడా నిర్ణాయక శక్తులుగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవెగౌడ కు కాంగ్రెస్ తో కలిసి ఉండక తప్పదు. ఇక మిగిలింది మాయావతిని ఒప్పించడం, ఈ పనికి వెంటనే ఫెడరల్ ఫ్రంట్ పూనుకోవాలి. అవసరమైతే ఇంకా ఎన్నికలు వివిధ దశల్లో ఉన్న రాస్త్రాలకు వెళ్లి వారికి  ప్రకటించాలి. అంతకంటే ముందు ఫెడరల్ ఫ్రంట్ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఫెడరల్ ఫ్రంట్ విధాన పత్రాలు సిద్ధం చేయాలి. కేసీఆర్ గారు ఇప్పటికే దీనికి సంబందించిన ముసాయిదా సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం నదీజలాల విధానాన్ని ప్రకటించాలి. అందులో కేసీఆర్ ను మించిన నైపుణ్యత ఇంకొకరికి లేదు. మౌలిక వనరుల అభివృద్ధి, సహజ వనరుల పంపిణి, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన వీటన్నిటిపై ముసాయిదాలు ప్రకటించాలి. గతంలో ఇదే ఆలోచన డీ ఎం కె అధినేత కరుణానిధి చాలాయేళ్ల క్రితం ప్రయత్నించారు. ఆయన రాజమన్నార్ కమిటీ వేసి 1969 లోనే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నివేదిక రూపొందించారు. సర్కారియా కమిషన్ (1988) కూడా ఈ విషయంలో విలువైన సూచనలు చేసింది. వీటి ఆధారంగా, అలాగే క్షేత్రస్థాయిలో కేసీఆర్ కు ఉన్న అనుభవం, ఆలోచనల ఆధారంగా ఒక సమగ్రమైన, ఆమోద యోగ్యమైన ప్రాతిపదికను సిద్ధం చేయాలి. రాష్ట్రాల ప్రయోజనాల ప్రాతిపదికన రేపటి ప్రభుత్వం ఏర్పడుతుందన్న విశ్వాసం అందరిలో కలగాలి. దీనికి కేసీఆర్ మాత్రమే నాయకత్వం వహించి అందరినీ కూడగట్టగలరన్నది జాతీయ మీడియా భావన. ఇది జరిగితే ఇప్పుడు తెలంగాణా ఉన్న 16 సీట్లు 216, అంతకుమించి కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇవాళ్టి రాజకీయాలు తర్కశాస్త్రమో, తత్వశాస్త్రమో కాదు,  అది ఉట్టి సంఖ్యాశాస్త్రం మాత్రమే. ఏమైనా సాధ్యమే!

Comments

Popular posts from this blog

తెలంగాణా రాష్ట్రంలో పాఠశాల విద్య: ప్రభుత్వ బాధ్యత, ఉపాధ్యాయుల కర్తవ్యం

ప్రొ. కోదండరాం స్వీయ రాజకీయ నాయకత్వ వైఫల్యం !!