ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కోటా కోరాలి ..!
తెలంగాణ ప్రభుత్వం ప్రయివేట్ యూనివర్సిటీల పై వెనక్కు తగ్గినట్టు ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రచురించింది. నిజమే అయితే నిజంగానే ఇదొక శుభవార్త. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటును అనుమతించాలని ప్రభుత్వం పై ఒత్తిడి ఉంది. గత ఏడాది కాలంగా దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. అంతే కాకుండా ముఖేష్ అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలు విద్యారంగంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమ వ్యాపారానికి తెలంగాణా అనువైన ప్రాంతమని భావించి, హైద్రాబాద్ పరిసరాల్లో కేజీ నుంచి పీజీ వరకు అన్ని సౌకర్యాలతో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంలో కొందరితో ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోతెలంగాణా ఉన్నత విద్యాశాఖ ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ఒక ముసాయిదాను ఇటీవలి కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టింది. దీనిపై లోతైన అధ్యయనం చేసేందుకు విద్యాశాఖ మంత్రి ఉపముఖ్యమంత్రి కూడా అయిన కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ఉపసంఘం ప్రస్తుతం జరుగుతున్న శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేమని, ఇందులో కొన్ని విషయాల పట్ల ప్రభుత్వం రాజకీయపరమైన విధాన నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యానంగా రేజర్వేషన్లు , ఫీజుల విషయంలో స్పష్టత రావాల్సి ఉందని ఉపసంఘం భావిస్తున్నట్టు చెపుతున్నారు. బిల్లు రూపొందింది అనగానే బయటినుంచి వచ్చిన నిరసనతో పాటు మంత్రివర్గంలో కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం అయినట్టు తెలిసింది. రూల్ అఫ్ రిజర్వేషన్ పాటించకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు అనుమతి ఇస్తే బయట బదనాం అవుతామని, ఎస్ సి, ఎస్, టీ, బీ సి వర్గాలనుంచి వ్యతిరేకత వస్తుందని కొందరు వాదించినట్టు తెలిసింది. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం తో సహా ఇప్పటికే విద్యార్ధి సంఘాలన్నీ ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం ఒక ముందడుగుగా భావించాలి. పౌరసమాజం ఇలా స్పందించినప్పుడు ఎంతటి బలమైన ప్రభుత్వమైనా తోక ముడవక తప్పదు.
ఏమిటీ కథ..!
దేశంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు కొత్త కాదు, విద్యారంగ నిపుణులు, మేధావులు ఎంత వ్యతిరేకించినా వినకుండామొదట యు పీ ఏ, తరువాత ఎన్ డీ ఏ ప్రభుత్వాలు ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చాయి. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ విశ్వా విద్యాలయాల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఒక విధాన పత్రాన్ని రూపొందించి చేతులు దులుపుకుంది. దీని ప్రకారం ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. దీని ఆసరాగా దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుకూలంగా ఉన్నాయి. ఆంద్ర ప్రదెశ్ తో సహా 25రాష్ట్రాలు ఇప్పటికే దీనిని చట్టబద్ధం చేశాయి. ఇప్పటికే దాదాపు 255 ప్రయివేటు విశ్వవిద్యాలయాలు దేశ వ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. వీటికి యూజీసీ గుర్తింపు కూడా ఇచ్చింది. ( http://www.ugc.ac.in/ privatuniversity.aspx) ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు చట్టాన్ని తీసుకురాని రాష్ట్రాల్లో తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడు కేరళ ప్రధానమైనవి. అత్యధికంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను భారతీయ జనతాపార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అనుమతించారు. ఇప్పటికి రాజస్థాన్, గుజరాతు రాష్ట్రాలు వీటిలో అగ్రభాగాన ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా చాలాకాలంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రయత్నం జరుగుతున్నా రాజకీయ ఏకాభిప్రాయం కుదరక బిల్లును ఉపసంహరించుకున్నారు. నిజానికి ఇప్పుడున్న విధానాల ప్రకారం ప్రయివేటు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం పాన్ షాప్ ఏర్పాటు చేసినంత తేలిక కాకపోతే డబ్బులుండాలి, స్థలం ఉండాలి, విధి విధానాలు రూపొందించుకుని ఉండాలి. కోర్సులు, అకడమిక్ నిర్ణయాలు, ఉద్యోగాలు ఇతరవ్యవహారాలు నిర్వహణ తదితర విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
అభ్యంతరం ఏమిటి ?
దేశంలో ప్రజలందరికి సమానత్వం -సామాజిక, ఆర్ధిక రాజకీయ సమ న్యాయాన్ని అందించడం లక్ష్యమని రాజ్యాంగ పీఠిక లో చెప్పుకున్నాం, భారత రాజ్యాంగం వివిధ అధికారణాల్లో సామాజిక అసమానతలు రూపుమాపడానికి విద్యను ఒక సాధనంగా చేసుకోవాలని, అందుకోసం నిర్బంధ నిర్బంధ ఉచిత విద్య అందించాలని రాసుకున్నాం. రాజ్యాంగం అంబెడ్కర్ ఈ అసమానతలు తొలగించడం కోసమే విద్యారంగాన్ని ప్రభుత్వ ఆధీనంలోఉంచాలని గట్టిగా నమ్మారు. అలాగే అవకాశాలు అందని వారికి, సామాజిక అణచివేతకు గురయిన వారికి అండగా ఉండేందుకు విద్యారంగంలో రిజర్వేషన్స్ ఉండాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కావస్తున్నా ప్రజలందరినీ అక్షరాస్యులను చేయడం అటుంచి, చదువుకున్న వాళ్లలో సమానత్వం సాధించడంలో పూర్తిగా విఫలమైన పాలకులు ఇప్పుడు సమానావకాశాలు కూడా అందకుండా కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లు కూడా అలాంటిదే. ఇది రాజ్యాంగ విరుద్ధం, రిజర్వేషన్స్ అండతో ఇప్పుడిప్పుడే ఎదిగి వస్తున్న దళిత, ఆదివాసీ, వెనుక బడిన వర్గాలకు, మహిళలకు వ్యతిరేకం, వారి హక్కులకు విరుద్ధం.అగ్రవర్ణ మహిళలు కూడా చదువు విషయంలో వెనుక బడిన వర్గం లోని వారే. అంటే దేశంలోని 90 శాతం మంది (అగ్రవర్ణ మహిళలతో సహా) ప్రజలకు వారి హక్కులకు, ప్రయోజనాలకు ఇది వ్యతిరేకమైనది.
పరిష్కారం ఎలా?
ప్రయివేటీకరణ సర్వసాధారణమని భావిస్తోన్న ఈ రోజుల్లో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం ఒక మంచి ప్రయత్నం. గత నలభయ్ ఏళ్లుగా ప్రజల తరఫున అలుపెరుగని రీతిలో ఆలోచనలు వినిపిస్తోన్న మేధావి ప్రొ. హరగోపాల్. ప్రయివేటీకరణ తో పాటుగా ప్రయివేట్ విశ్వవిద్యాలయాలను ఎందుకు వ్యతిరేకించాలి అని తన వ్యాసంలో వివరించారు. అయితే ఇది ఒక సైద్ధాంతిక విశ్లేషణ మాత్రమే. హరగోపాల్ గారు తన సిద్ధాంతాల ప్రాతిపదికన స్థూలంగా ప్రయివేటు విశ్వాబిద్యాలయాలను ఎందుకు వ్యతిరేకించాలో చెప్పారు గానీ అది గెలిచే వాదన కాదు. ఎందుకంటె చాలా మంది మేధావులు, గడిచిన ఇరవై అయిదేళ్లుగా దీనిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికే ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఈ విశ్వవిద్యాలయాలు వచ్చేసాయి. ఆగిన చోట్ల ఎందుకు ఆగాయి ఒక సారి గమనిస్తే మనం ఏం చేయాలో అర్థమౌతుంది. ఈ మధ్యకాలంలోనే మహారాష్ట్రా ప్రభుత్వం శాసన సభనుంచి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును ఉపసంహరించుకుంది. ఎస్, సి, ఎస్ టీ, బీ సి రిజర్వేషన్స్ లేకుండా యూనివర్సిటీలను అంగీకరించేది లేదని అక్కడి శాసన సభ్యులు తెగేసి చెప్పడంతో బీజేపీ ప్రభుత్వం చేసేదేమీలేక తోక ముడిచింది. మహారాష్ట్రాలో దళిత ఉద్యమం, దళిత రాజకీయాలు, వెనుకబడిన తరగతుల చైతన్యం వలన ఇది సాధ్యపడింది. కేరళ, తమిళనాడులో ఆ ఆలోచన కూడా రాలేక పోవడానికి కూడా అదే కారణం. ఇప్పటికే కోర్టుల పరిమితితో సంబంధం లేకుండా 69 శాతం రిజర్వేషన్స్ ఇస్తోన్న తమిళనాడులో రిజర్వేషన్స్ లేకుండా ఏదీ నడవదు. కాబట్టి అక్కడ బిల్లు రాదు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టడానికి కూడా ఎవరూ రారు. ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణా. తెలంగాణా లో పెట్టుబడులకు తలుపులు తెరిచే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు పదేపదే చెప్పినట్టు తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి 'చువ్వలు కూడా లేని ఏక గవాక్షం' స్వాగతం పలుకుతోంది. కాబట్టి ఇవాళ అంబానీ తావు సహా అందరూ తెలంగాణా కు రావడానికి సిద్ధమౌతున్నారు. ఇప్పుడు కావాల్సింది కేవలం సిద్ధాంత పరమైన వ్యతిరేకత కాదు. యుద్ధానికి సిద్ధంగా ఉండే నిబద్ధత. ముఖ్యానంగా దళిత, ఆదివాసీ, వెనుకబడిన కులాల ప్రతిఘటన. ఇవాళ పాలక వర్గాలు కులానికే భయపడతాయి, కాబట్టి దళిత్ బహుజన కులాలు, ఆదివాసులు ఏకమవ్వాలి. ఇది మా కులానికి, జాతికి, హక్కులకు వ్యతిరేకం అని నినదించాలి. హరగోపాల్ గారు కులాన్ని గుర్తించలేదు గానీ మనం పాలక వర్గాలకు ఆ సంగతి గుర్తు చేయాలి. వినక పోతే 2019 లో సంగతి చూస్తామని బెదిరించాలి. అదొక్కటే మందు.
ఇప్పుడున్న చట్టాల్లో హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాజ్యాంగబద్ధమైన అన్ని రిజర్వేషన్స్ ని గుర్తించాయి, హర్యానా స్థానికులకు 25% రిజర్వేషన్స్ ఇచ్చి అందులో కేవలం ఎస్ సి లకు 10% రిజర్వేషన్స్ ఇస్తున్నాయి, మహారాష్ట్రా ముసాయిదా 50% రిజర్వేషన్స్ ప్రతిపాదించింది. అయితే చాలా చోట్ల ఇవిలేవు. ఇప్పుడు మనకు రెండే మార్గాలు, ఒకటి హరగోపాల్ గారు చెప్పినట్టు ప్రయివేట్ యూనివర్సిటీలను మొత్తంగా వ్యతిరేకించడం. రెండోది 50% రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేయడం. రెండవదే ముఖ్యమని నా అభిప్రాయం.
-వి. నీలమేఘం
Comments
Post a Comment